Studio18 News - జాతీయం / : 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్‌లోని అణు నిల్వ కేంద్రాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకోలేదని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు. కిరానా హిల్స్ వద్ద ఉన్న పాక్ అణు స్థావరంపై భారత్ దాడి చేసిందంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించేందుకు త్రివిధ దళాల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఊహాగానాలపై ఆయన స్పష్టతనిచ్చారు. పాకిస్థాన్ తన అణ్వాయుధాలను నిల్వ చేస్తున్నాయని భావిస్తున్న కిరానా హిల్స్‌పై దాడి చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పందిస్తూ, పాకిస్థాన్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్‌లో నిల్వ ఉంచుతుందని సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వాటి గురించి ఇప్పటిదాకా తమకు తెలియదని అన్నారు. ‘‘అక్కడ ఏమున్నా సరే.. మేం మాత్రం ఆ కొండలను లక్ష్యంగా చేసుకోలేదు. మా టార్గెట్ లిస్ట్‌లో ఆ ప్రాంతం లేదు’’ అని ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పటి నుంచి, పాకిస్థాన్‌లోని సర్గోధా వైమానిక స్థావరం సమీపంలో ఉన్న కిరానా హిల్స్‌లోని అణు నిల్వలపై భారత్ దాడి చేసి ఉండవచ్చని అనేక వార్తలు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సర్గోధా వైమానిక స్థావరంపై దాడి జరిగినట్లు భారత సైన్యం ధృవీకరించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇటీవల పాకిస్థాన్‌లో సంభవించిన భూకంపాలకు, ఈ దాడికి సంబంధం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ వదంతులన్నింటికీ ఏకే భారతి తన ప్రకటనతో తెరదించారు.
Admin
Studio18 News