Studio18 News - జాతీయం / : భారతదేశ భద్రతా విధానంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. భవిష్యత్తులో దేశ భూభాగంపై జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలనైనా ఇకపై 'యుద్ధ చర్య'గానే పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, దానికి ప్రతిగా కొనసాగుతున్న 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో, ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక అని ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఐఏఎన్ఎస్‌కు తెలిపాయి. భవిష్యత్ ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగా పరిగణించాలన్న ఈ నిర్ణయంతో, దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న 'వ్యూహాత్మక సంయమనం' అనే విధానానికి స్వస్తి పలికినట్లయింది. "ఇది కేవలం భద్రతాపరమైన మార్పు మాత్రమే కాదు, ఉగ్రదాడులను ఇకపై భారత్ విడివిడి ఘటనలుగా పరిగణించబోదని ప్రపంచానికి ఇస్తున్న సంకేతం" అని ప్రభుత్వ వర్గాలు ఐఏఎన్ఎస్‌కు వివరించాయి. దీని ద్వారా, ఉగ్రవాదానికి ప్రతిగా కేవలం చట్టపరమైన చర్యలే కాకుండా, అవసరమైతే సైనిక శక్తితో బదులిస్తామని భారత్ తేల్చిచెప్పింది. ఈ సిద్ధాంతపరమైన మార్పుతో, సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడితే రాజకీయంగా, దౌత్యపరంగా, సైనికపరంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ స్పష్టం చేసింది. గత మూడు రోజులుగా రాత్రి సమయాల్లో ఉత్తర భారతదేశంలోని పలు సైనిక స్థావరాలు, పౌర నివాసిత ప్రాంతాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, భారత పటిష్టమైన వాయు రక్షణ వ్యవస్థ ఈ దాడులను పూర్తిగా అడ్డుకోగలిగింది. రెండు వారాల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ సంబంధిత ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనకు ప్రతిస్పందనగా, భారత్ పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన క్రూయిజ్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
Admin
Studio18 News