Studio18 News - జాతీయం / : లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూశామని... ప్రజలు మనవైపే ఉన్నారని తెలిసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అన్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె దిశానిర్దేశనం చేశారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో మనకు ప్రజలు మద్దతిచ్చారని గుర్తు చేశారు. అది అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగేలా చూసుకోవాలన్నారు. త్వరలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, వాటికి మనం సమాయత్తం కావాలన్నారు. కష్టపడి పని చేస్తే లోక్ సభ ఎన్నికల ఫలితాలే రావొచ్చునని... కానీ అతివిశ్వాసం మాత్రం వద్దని హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ కోల్పోయిందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా ప్రజలను వర్గాలుగా విభజిస్తూ, శత్రుత్వాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో రైతులు, యువతను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కీలకమైన రంగాల్లో పెండింగ్ పనులకు కేటాయింపుల్లో న్యాయం చేయలేదన్నారు. కావడియాత్రలో విధించిన నియమాలు ఆరెస్సెస్ భావజాలాన్ని వెల్లడిస్తోందని, సుప్రీంకోర్టు సరైన సమయంలో జోక్యం చేసుకుందన్నారు.
Admin
Studio18 News