Studio18 News - అంతర్జాతీయం / : Hamas Chief Ismail Haniyeh : ఇజ్రాయెల్, హమాస్ గ్రూప్ మధ్య గత కొద్దినెలలుగా యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో తాజాగా హమాస్ గ్రూప్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని హమాస్ గ్రూప్ చీఫ్ ఇస్మాయిల్ హనియా నివాసంపై ఇజ్రాయెల్ మెరుపు దాడులకు దిగింది. ఈ దాడిలో ఇస్మాయిల్ హనియా చనిపోయినట్లు బుధవారం హమాస్ వెల్లడించింది. మంగళవారం ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కీయన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని తన నివాసంకు చేరుకున్న తరువాత ఈ దాడి జరిగిందని, ఈ దాడిలో హనియా చనిపోయారని హమాస్ తెలిపింది. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ దాడికి సంబంధించిన వివరాల గురించి స్పష్టమైన సమాచారం లేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ పేర్కొంది. ఈ దాడిలో హనియాతో పాటు ఆయన బాడీగార్డ్ కూడా మరణించినట్లు హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం కీలక దశలోఉన్న వేళ ఇస్మాయిల్ మృతి హమాస్ కు భారీ ఎదురుదెబ్బగా మారింది. తాజా పరిణామంతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏమైనా ప్రతీకారం తీర్చుకుంటుందా అనే అంశం పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు హమాస్ ప్రతీకార దాడులకు దిగేందుకు అవకాశం ఉండటంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.
Admin
Studio18 News