Studio18 News - జాతీయం / : దేశంలో కులగణన చేపట్టాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. కాన్షీరామ్ జయంతి సందర్భంగా 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన ఆమె కులగణన చేయాలని పునరుద్ఘాటించారు. సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం దీనిని విస్మరించకూడదని పేర్కొన్నారు. కులగణన చేయకుంటే అది సుపరిపాలన కాబోదని ఆమె రాసుకొచ్చారు. కులగణన చేయకపోవడంపై ఒక పార్లమెంటరీ కమిటీ కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 80 శాతం మంది బహుజనులు ఉన్నారని, ఇలాంటి చోట్ల కులగణన చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో మాయావతి తనను తాను ఉక్కు మహిళగా పేర్కొన్నారు. ఉక్కు మహిళ నాయకత్వంలోని బీఎస్పీ మాటల కంటే చేతలకు ఎంతటి విలువను ఇస్తుందో ఉత్తరప్రదేశ్ ప్రజలకు తెలుసని అన్నారు.
Admin
Studio18 News