Studio18 News - అంతర్జాతీయం / : సంచలనం సృష్టించిన పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనలో ఆర్మీ ఆపరేషన్ విజయవంతమైంది. వేర్పాటువాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు పాక్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ పూర్తయింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 33 మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హతమయ్యారు. అలాగే, 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, రైలులోని మిగిలిన ప్రయాణికులను కాపాడామని ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు బలూచిస్థాన్ ప్రావిన్సులోని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళ్తుండగా మొన్న బీఎల్ఏ మిలిటెంట్లు దానిని హైజాక్ చేశారు. రైలులోని 9 బోగీల్లో ఉన్న 440 మందిని వారు బందీలుగా చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ విజయవంతంగా ఆపరేషన్‌ను ముగించి, రైలును తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్రయాణికులను రక్షించిన భద్రతా బలగాలు, నిన్న మిగతా ప్రయాణికులను రక్షించాయి.
Admin
Studio18 News