Studio18 News - క్రీడలు / : 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిపాలయ్యాక కేఎల్ రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే రాహుల్ ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో కీలకంగా మారి టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర వహించి ప్రశంసలు అందుకున్నాడు. ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్ 2020 నుంచి వన్డే ఫార్మాట్‌లో ఐదో నంబర్‌లో దిగుతూ జట్టును కాపుకాస్తున్నాడు. రిషభ్ పంత్ యాక్సిడెంట్ నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ రాహులే జట్టుకు ఫస్ట్ చాయిస్‌గా కనిపిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రతిభ కనబర్చిన కేఎల్ రాహుల్ ఈ టోర్నీలో 140 సగటుతో 140 పరుగులు చేశాడు. ఒక్కసారి మాత్రమే అది కూడా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అవుటయ్యాడు. ఆ మ్యాచ్‌లో 23 పరుగులు చేశాడు. ఐసీసీ వైట్‌బాల్ టోర్నీ చరిత్రలో రాహుల్ చేసిన 140 సగటు భారత్ తరపున అత్యధికం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డును బద్దలుగొట్టాడు. కోహ్లీ 2016 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ 136.50 సగటుతో 273 పరుగులు సాధించాడు. ఇప్పుడా రికార్డును రాహుల్ తుడిచిపెట్టేశాడు. ఐసీసీ టోర్నీలలో 100కుపైగా సగటు సాధించిన భారత ఆటగాళ్లలో రాహుల్ 140తో అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 140 సగటుతో 140 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు. విరాట్ 5 మ్యాచుల్లో 136.5 సగటుతో 273 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఉన్న మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ 5 మ్యాచుల్లో 130 సగటుతో 130 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ (129), సౌరవ్ గంగూలీ (116), సునీల్ గవాస్కర్ (113), విరాట్ కోహ్లీ (106.333) ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే రాహుల్ సగటు ఏడో అత్యుత్తమం. చాంపియన్స్ ట్రోఫీలో మూడోది. ఈ జాబితాలో పాక్ మాజీ ఓపెనర్ ఆటగాడు సయీద్ అన్వర్ 200కుపైగా సగటుతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2000వ సంవత్సరంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అన్వర్ రెండు ఇన్నింగ్స్‌లలో 209 సగటుతో 209 పరుగులు చేశాడు.
Admin
Studio18 News