Studio18 News - అంతర్జాతీయం / : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఆమెను తీసుకొచ్చేందుకు సిద్ధమైన ఫాల్కన్ 9 రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ‘క్రూ 10‘ మిషన్ ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య కనిపించడంతో ప్రయోగాన్ని ఆపివేసినట్టు నాసా ప్రకటించింది. సమస్యను పరిష్కరించి మరో వారం రోజుల్లో ప్రయోగం చేపడతామని పేర్కొంది. ఫాల్కన్ 9 రాకెట్ క్రూ10 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రం చేరుకుంటారు. వీరు అక్కడ ఉండి, అక్కడ చిక్కుకుపోయిన సునీత, బచ్ విల్‌మోర్‌లను భూమిపైకి పంపుతారు. నిజానికి క్రూ 10 అంతరిక్ష నౌక నిన్ననే అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావాల్సి ఉంది. 19న వారు భూమిపైకి రావాల్సి ఉంది. అయితే, తాజాగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి రాక మరిన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాగా, వారం రోజుల ప్రయోగాల నిమిత్తం సునీత, విల్‌మోర్ గతేడాది జూన్ 5న ‘స్టార్ లైనర్’లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉంటున్నారు. వారిని భూమ్మీదకి తీసుకొచ్చేందుకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘క్రూ 10’ అంతరిక్ష నౌకను సిద్ధం చేశారు. Sunita Williams Butch Wilmore
Admin
Studio18 News