Studio18 News - జాతీయం / : తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చిందని, అందుకే అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్షను విధించేలా చట్టాలను సవరించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. అమ్మాయిలు ఆలస్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటారని, కానీ అబ్బాయిల విషయంలోనూ అలాగే ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చి, నిబంధనలు, చట్టాలను మార్చామని నరేంద్ర మోదీ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ఆత్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉందని గాంధీ చెప్పారని, మహిళలు మన గ్రామీణ ప్రాంతాలకు ఆత్మగా భావిస్తున్నానని అన్నారు. ముస్లిం మహిళల జీవితాలను నిలబెట్టేందుకు ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చామని గుర్తు చేశారు. మహిళల సారథ్యంలో ఎన్నో సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన అన్నారు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదం కలిగిన తాను ప్రపంచంలోనే అత్యంత ధనికుడినని వ్యాఖ్యానించారు.
Admin
Studio18 News