Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ లిరిక్ రైటర్ కులశేఖర్ (53) హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు. పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాతి రోజుల్లో మానసికంగా చాలా కుంగిపోయారు. విశాఖపట్నంకు చెందిన కులశేఖర్ మొదట హైదరాబాద్‌లో జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత లిరిక్ రైటర్‌గా మారారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెళకువలు తెలుసుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'జయం', 'నువ్వు నేను', 'భద్ర', 'సంతోషం', 'ఔనన్నా కాదన్నా', 'వసంతం', 'రామ్మా చిలకమ్మా', 'వసంతం', 'మృగరాజు', 'సుబ్బు', 'సైనికుడు' వంటి చిత్రాల్లో సూపర్‌హిట్ పాటలు రాశారు. కానీ, ఆ తర్వాత ఆయన కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు. దాంతో మానసికంగా కులశేఖర్ కుంగిపోయారు. ఓ రకమైన మానసిక రుగ్మత కారణంగా దొంగతనాలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన కేసుల్లో పలుమార్లు జైలుకి కూడా వెళ్లొచ్చారు. గత కొన్నేళ్లుగా పెద్దగా సినిమా పాటలు రాయలేదు. బయట కూడా కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన చనిపోయారని తెలిసి సినీ పరిశ్రమకు చెందినవారు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, కులశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read : ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఖాళీలకు ఉప ఎన్నికలు... షెడ్యూల్ విడుదల
Admin
Studio18 News