Studio18 News - క్రీడలు / : ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను ఏకంగా రూ. 27కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. ఇక ఐపీఎల్ వేలంలో లక్నోకు వెళ్లిపోయిన పంత్ ఢిల్లీని వీడుతూ అభిమానులను ఉద్దేశించి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఎమోషనల్ పోస్టు చేశాడు. "ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రయాణం చాలా అద్భుతమైంది. మైదానంలో ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలు. నేను టీనేజర్‌గా ఇక్కడికి వచ్చాను. తొమ్మిదేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాను. అందుకు అభిమానులే కారణం. అభిమానులారా... నా ఈ ప్రయాణాన్ని మీరు ఎంతో విలువైనదిగా మార్చారు. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచారు. నా జీవితంలో కఠిన సమయాల్లో అండగా ఉన్నారు. వేరే జట్టుకు వెళ్తున్నా మీ ప్రేమ, మద్దతును నా హృదయంలో పదిలంగా దాచుకుంటాను. మైదానంలోకి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఎప్పటిలాగే అలరించడానికి ప్రయత్నిస్తాను. నా ఈ జర్నీని ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు" అని పంత్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
Also Read : గజేంద్రసింగ్ కు 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించాం: పవన్ కల్యాణ్
Admin
Studio18 News