Studio18 News - క్రీడలు / : భారత ఆటగాడు నితీశ్ రాణాను రాజస్థాన్ రాయల్స్ 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ.1.50 కోట్లుగా ఉండగా, దాదాపు మూడు రెట్లకు కొనుగోలు చేసింది. నితీశ్ గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. నితీశ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ కనిపించింది. చివరకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. అవసరమైన సమయంలో వేగంగా బ్యాటింగ్ చేయడంతో పాటు మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. రాణా కోసం తొలుత చెన్నై బిడ్డింగ్ ప్రారంభించింది. రాజస్థాన్ రూ.1.60 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాంచైజీల మధ్య పోటీతో ధర కాస్త రూ.2.20 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత బెంగళూరు కూడా రాణా కోసం పోటీ పడింది. చివరకు రాజస్థాన్ రూ.4.20 కోట్లకు దక్కించుకుంది. 2016లో ఐపీఎల్ ఆరంగేట్రం చేసిన రాణా ఐపీఎల్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 107 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 28.34 సగటుతో 2,636 పరుగులు చేశాడు. ఎలాంటి ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొనే బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2025 ఐపీఎల్‌కు ముందు కోల్‌కతా అతనిని వదులుకుంది. కానీ ఐపీఎల్ పూల్ ఆటగాళ్ల జాబితాలో అతను ఫేవరేట్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్ వేలం రెండో రోజు ప్రారంభమైంది. ఫ్రాంచైజీలు తమ వద్ద ఉన్న డబ్బుతో ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇతర ఆటగాళ్ళ విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్‌ను గుజరాత్ రూ.3.2 కోట్లకు, మార్కో జాన్సెన్‌ను పంజాబ్ రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని కనీస ధర రూ.1.25 కోట్లు కావడం గమనార్హం. శామ్ కుర్రాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.2.40 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన జోస్ ఇంగ్లీష్‌ను పంజాబ్ కింగ్స్ రూ.2.60 కోట్లకు తీసుకుంది. సౌతాఫ్రికా ఆటగాడు రియాన్ రికెల్‌టన్‌ను ముంబై ఇండియన్స్ రూ.1 కోటికి కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను బెంగళూరు రూ.5.75 కోట్లకు తీసుకుంది. తుషార్ దేశ్‌పాండేను రాజస్థాన్ రూ.6.50 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, బెంగళూరు రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ముకేశ్ కుమార్‌ను ఢిల్లీ రూ.8 కోట్లకు, దీపక్ చాహర్‌ను ముంబై రూ.9.25 కోట్లకు, ఆకాశ్ దీప్‌ను లక్నో రూ.8 కోట్లకు, ఫెర్గున్‌సన్‌ను పంజాబ్ రూ.2 కోట్లకు, ఆప్ఘన్ స్పిన్నర్ గజన్‌ఫర్‌ను ముంబై రూ.4.80 కోట్లకు తీసుకున్నాయి. అజింక్యా రహానే, పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.
Also Read : రొములస్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Admin
Studio18 News