Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హైదరాబాద్‌లోని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఆర్‌జీవీని అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, వర్మ ఇంట్లో లేరని ఆయన సన్నిహితులు పోలీసులకు చెబుతున్నట్టు తెలిసింది. దాంతో పోలీసులు అక్కడే ఎదురుచూస్తున్నారు. ఆర్‌జీవీ ఎక్కడికి వెళ్లారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో అరెస్టు భయంతోనే ఆర్‌జీవీ అదృశ్యమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఒంగోలు రూరల్ పీఎస్ లో విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో... ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కనిపించకుండా పోయారు. కాగా, వైసీపీ హయాంలో ప్రతిపక్షనేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆర్‌జీవీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఒంగోలులో నమోదైన ఈ కేసు విచారణకు ఆయన హాజరు కాలేదు. అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు తాము రక్షణ కల్పించలేమని చెప్పడంతో విచారణకు వచ్చేందుకు కాస్త సమయం కావాలని కోరారు. కానీ, ఇచ్చిన గడువు ముగిసినా వర్మ విచారణకు రాకపోవడంతో ఒంగోలు పోలీసులు ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్‌జీవీ డెన్‌కు చేరుకున్నారు. కానీ, ఇప్పుడు ఆయన ఇంట్లో లేకపోవడంతో అక్కడే వేచి చూస్తున్నారు.
Admin
Studio18 News