Studio18 News - అంతర్జాతీయం / : అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపించేందుకు అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించేందుకూ సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్.. వచ్చే జనవరి 20న ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తన క్యాబినెట్ మినిస్టర్లను, సలహాదారులను ట్రంప్ ఎన్నుకుంటున్నారు. కీలక పోస్టుల్లో తనకు నమ్మకస్తులను, సమర్థులను నియమిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెతికిపట్టుకుని వారి వారి దేశాలకు పంపించనున్నట్లు ట్రంప్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం అవసరమైతే బోర్డర్ సెక్యూరిటీ అంశంపై జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకూ సిద్ధమని వెల్లడించాయి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి, సైనిక బలగాల సాయంతో మాస్ డిపోర్టేషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి. అమెరికాలోకి అక్రమ మార్గాల ద్వారా చేరుకుని, అధికారుల కళ్లుగప్పి దేశంలోనే ఉంటున్న వారిని పట్టుకుని వెనక్కి పంపించాలని ట్రంప్ నిర్ణయించారు. అదేసమయంలో మెక్సికో బోర్డర్ నుంచి అక్రమంగా అమెరికాలోకి అడుగుపెట్టే మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు. బోర్డర్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి అక్రమ వలసలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. దేశంలోని అక్రమ వలసదారులను తిరిగి పంపించేందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధమవుతున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో ఓ పోస్టు కూడా పెట్టారు. దీంతో అమెరికాలోకి అక్రమ పద్ధతుల్లో ప్రవేశించి ఉంటున్న వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కిమ్ తో భేటీ అయిన రష్యా మంత్రి
Admin
Studio18 News