Studio18 News - క్రీడలు / : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాము పాకిస్థాన్ వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. హైబ్రిడ్ మోడల్ విధానంలో తమ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ఐసీసీ... పీసీబీకి తెలియజేసింది. అయితే, పీసీబీ ఈ విషయంలో మౌనం వహిస్తున్నట్లు సమాచారం. దాంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మోడల్ విధానంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, ఎట్టిపరిస్థితుల్లో దేశం వెలుపలకు ఒక్క మ్యాచ్‌ను కూడా మార్చొద్దని పాకిస్థాన్ ప్రభుత్వం పీసీబీని కోరినట్లు తెలుస్తోంది. దాంతో పాకిస్థాన్ కూడా దేశం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా వెళ్లనివ్వకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం టోర్నమెంట్‌ను స్వదేశంలో నిర్వహించే హక్కులు తమ వద్ద ఉన్నప్పుడు బయటకు టోర్నీని ఎలా వెళ్లనిస్తామని పీసీబీ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం దేశం వెలుపల ఒక్క మ్యాచ్‌ను కూడా అనుమతించడానికి నిరాకరించిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో కథనం పేర్కొంది. "పాకిస్థాన్ నుండి ఒక్క మ్యాచ్‌ను కూడా తరలించవద్దని మా ప్రభుత్వం మాకు చెప్పింది. మేము కూడా అదే మాటపై ఉంటాం. ప్రస్తుతం భారత్ నిర్ణయం గురించి ఐసీసీ మాకు తెలియజేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య హక్కులు మాకు ఉన్నాయి. కాబట్టి మేము పాకిస్థాన్ వెలుపల మ్యాచ్‌లను తరలించడానికి ఒప్పుకోం” అని పీసీబీ అధికారి ఒకరు అన్నట్టు కథనం తెలిపింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కూడా తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో ఇదే విషయాన్ని ధృవీకరించారు. హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించకుండా పీసీబీని దేశ ప్రభుత్వం కట్టడి చేసిందని చెప్పారు. మొత్తం టోర్నీని స్వదేశంలో నిర్వహించాలని పాకిస్థాన్ భావిస్తుండగా, భద్రతా కారణాలతో సరిహద్దు దాటడానికి భారత్ ఇష్టపడటం లేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడంపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ పీసీబీ హైబ్రిడ్ మోడల్ విధానాన్ని అంగీకరించకపోతే టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం ఉందని గతంలో ఒక నివేదిక పేర్కొంది. ఇక రెండు దాయాది దేశాలను వదులుకుని టోర్నమెంట్‌ను నిర్వహించే సాహసం ఐసీసీ చేయలేదు. ఒకవేళ అలా చేస్తే ఐసీసీ ఆదాయానికి భారీ గండి పడుతుంది
Also Read : రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు
Admin
Studio18 News