Studio18 News - క్రీడలు / : ఝార్ఖండ్ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. భార్య సాక్షితో కలిసి రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఎంఎస్‌డీ ఓటు వేశాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరాడు. ఇక ధోనీ దంపతులు రాంచీలో ఓటు వేసేందుకు రావడంతో వారిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దాంతో భద్రతా సిబ్బంది ధోనీ, సాక్షికి రక్షణ కల్పించి పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. ధోనీ దంపతులు ఓటు వేసేందుకు వచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ నెల 23న ఫలితాలు వెల్లడవుతాయి.
Also Read : 'మా నాన్న సూపర్ హీరో' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Admin
Studio18 News