Studio18 News - జాతీయం / : ప్రధాని నరేంద్రమోదీ పాదాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నమస్కరించే ప్రయత్నం చేశారు. బీహార్‌లోని దర్భంగాలో జరిగిన కార్యక్రమంలో ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నితీశ్ కుమార్... మోదీ వైపు నడుస్తూ అతని పాదాలను తాకే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. అయితే ఇది గుర్తించిన ప్రధాని వెంటనే తన కాళ్లని వెనక్కి తీసుకున్నారు. అతనితో కరచాలనం చేశారు. ఇదే కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు ప్రధాని మోదీకి పూలమాల వేస్తుండగా... ఆయన నితీశ్ కుమార్‌ను తన వైపుకు లాక్కున్నారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, దర్భంగాలో ప్రధాని మోదీ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.12 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని, సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్‌పై నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్‌ను బయటకు తీసుకువచ్చారని ప్రశంసించారు. కాగా, ప్రధాని మోదీ పాదాలకు నితీశ్ కుమార్ నమస్కరించేందుకు ప్రయత్నించడం ఈ ఏడాది ఇది మూడోసారి. జూన్‌లో పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రధానిని కలిసిన సందర్భంలో మోదీ పాదాలను తాకే ప్రయత్నం చేశారు. అంతకుముందు, లోక్ సభ ఎన్నికల సమయంలో నవదాలో నిర్వహించిన సభలో మోదీ పాదాలను తాకారు.
Also Read : చక్కెర ఎక్కువ తింటే డయాబెటిస్ వస్తుందా?... వాస్తవాలివే!
Admin
Studio18 News