Studio18 News - జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డెమోక్రాట్ నేత కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్ ను చేయాలని అక్కడి నేత ఒకరు తాజాగా డిమాండ్ చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో కమలా హ్యారిస్ కమ్యూనికేషన్స్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జమాల్ సిమన్స్ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం.. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి తర్వాతి ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ఈలోగా అధికార మార్పిడికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. ఈ క్రమంలో ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి కొన్ని వారాల సమయం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ రాజీనామా చేస్తే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దేశ తొలి మహిళా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతారని తెలిపారు. ఈ ప్రక్రియ రాబోయే కాలంలో అధ్యక్ష ఎన్నికల పోటీలో మహిళలు నిలవడానికి దోహదం చేస్తుందని చెప్పారు. పాలనా బాధ్యతలను ఇప్పటి వరకు అద్భుతంగా నిర్వహించిన బైడెన్.. తన చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున పోటీ చేసిన కమలా హ్యారిస్ మొత్తం 226 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు. స్వింగ్ స్టేట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లతో ఎన్నికల్లో విజయం సాధించారు.
Also Read : తెలంగాణ మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు!
Admin
Studio18 News