Studio18 News - క్రైమ్ / : విశాఖ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు జాయ్ జెమీమా పోలీసులకు ఝలక్ ఇచ్చినట్లు గుర్తించారు. 10 నెలల కిందటే ఓ వ్యాపారవేత్తను హనీ ట్రాప్ చేసి కేసు పెట్టించింది జాయ్ జెమీమా. ఆ టైమ్ లో జెమీమా మోసాలను గుర్తించలేకపోయారు పోలీసులు. జెమీమా ఫిర్యాదుతో అనేకమంది అమాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. వరుసగా ఫిర్యాదులు రావడంతో జెమీమా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనేకమంది వ్యాపారవేత్తలను మోసగించిన కిలేడీ.. హనీ ట్రాప్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో తవ్వే కొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జాయ్ జెమీమా మోసాలు బయటపడుతున్నాయి. పెళ్లైన యువకులనే కాకుండా అనేకమంది వ్యాపారవేత్తలను సైతం జెమీమా మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. పది నెలల క్రితమే కాఫీ షాప్ కు సంబంధించిన ఒక వ్యాపారవేత్తను ట్రాప్ చేసింది. అతడి కాఫీ షాప్ కి వెళ్లిన జెమీమా.. తనను తాను డిజిటల్ క్రియేటర్ గా పరిచయం చేసుకుంది. కాఫీ షాప్ కు డిజిటల్ మార్కెటింగ్ చేస్తామంటూ అతడితో పరిచయం చేసుకుంది. ఆ తర్వాత ప్రేమగా ఉంటున్నట్లు నటించింది. ఆ తర్వాత అతడిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు అతడిని వేధించడం మొదలు పెట్టింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అందుకు ఆయన నిరాకరించడంతో.. తన దగ్గరున్న ఫొటోలతో చూపి అతడిని బెదిరించింది. అంతేకాదు అతడిపై కేసు కూడా నమోదు చేయించింది. పోలీసులు విచారణ చేస్తున్నా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది. కమిషనర్ ను కూడా సంప్రదించింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులకు సైతం ఝలక్ ఇచ్చింది. జెమీమాపై వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు అలర్ట్.. జెమీమా ఒత్తిడితో మరో దారి లేక పోలీసులు కాఫీ షాప్ కు చెందిన వ్యాపారవేత్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో వ్యక్తిని ట్రాప్ చేసింది జెమీమా. ఎన్.ఆర్.ఐ ని బెదిరించి డబ్బులు వసూలు చేసింది. దాంతో బాధితుడు భీమిలి పోలీసులకు జెమీమాపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కంచరపాలెంలో మరో వ్యక్తి కూడా జెమీమాపై ఫిర్యాదు చేశాడు. ఇలా వరుసగా కంప్లైంట్లు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జెమీమాపై ఫోకస్ పెట్టారు. వారి విచారణలో జెమీమా మోసాలు బయటపడ్డాయి. హనీ ట్రాప్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు బాధితులు వెలుగులోకి వచ్చారు. దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇంకా జెమీమా ముఠాలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి జెమీమాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. మిగిలిన వారి గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వారి పాత్ర గురించి ఆరా తీస్తున్నారు. వారిని సైతం త్వరలో అరెస్ట్ చేస్తామని సీపీ వెల్లడించారు. జెమీమా బాధితులు.. ఒక్క విశాఖలోనే కాదు.. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం..
Admin
Studio18 News