Studio18 News - టెక్నాలజీ / : దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఐ చెల్లింపుల విధానం అంతకంతకూ వృద్ధి చెందుతోంది. మొబైల్ నంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేసుకుని సులభంగా వినియోగించుకునే అవకాశం ఉండడంతో చాలా మంది ఈ చెల్లింపుల విధానంలోకి మారారు, ఇంకా మారుతున్నారు. దీంతో జేబులో నగదు తీసుకెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో యూపీఐ చెల్లింపుల విధానాన్ని మరింత సురక్షితంగా, సులభంగా మార్చడంలో భాగంగా ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా చిన్నచిన్న లావాదేవీల కోసం ‘యూపీఐ వాలెట్’ విధానాన్ని ఈ మధ్యే ప్రవేశపెట్టింది. యూపీఐ వర్సెస్ యూపీఐ వాలెట్ ఏది బెస్ట్.. యూపీఐ పేమెంట్లతో పోల్చితే యూపీఐ వాలెట్ పేమెంట్లు మరింత సౌకర్యవంతంగా, పలు విధాలా సురక్షితంగా ఉంటాయి. యూపీఐలో వినియోగదారుడు తన బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. యూపీఐ వాలెట్‌లో బ్యాలెన్స్‌ను యూపీఐ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐలో బ్యాంక్ ఖాతాలను అనుసంధానించుకుంటే, యూపీఐ వాలెట్‌లో యూపీఐకి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ విధానంలో ట్రాన్స్‌ఫర్ చేసే నగదు బ్యాంక్ ఖాతాల నుంచి కట్ అవుతుంది. అయితే యూపీఐ వాలెట్‌లో మాత్రం వాలెట్ నుంచి అవతలి వ్యక్తి బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది. యూపీఐ వాలెట్‌ను ఉపయోగించి చిన్న చిన్న లావాదేవీలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒక ట్రాన్సాక్షన్‌లో గరిష్ఠంగా రూ.1000 మాత్రమే పంపించే అవకాశం ఉంటుంది. ఒక రోజులో గరిష్ఠంగా రూ.10,000 వరకు పంపించవచ్చు. కాబట్టి ఇందులో సైబర్ మోసాలు జరిగినా రిస్క్‌లో ఉండే డబ్బు తక్కువగా ఉంటుంది. ఇక యూపీఐ వాలెట్‌లో యూపీఐ మాదిరిగా డబ్బు బదిలీ చేసే ప్రతిసారీ పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో చెల్లింపులను వేగంగా, సులభంగా చేసేందుకు అవకాశం ఉంది. కిరాణా దుకాణాలు, టీ స్టాల్ వంటి చిన్న ఖర్చులకు యూపీఐ వాలెట్ ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తంగా యూపీఐ వాలెట్ పరిధి తక్కువే అయినా భద్రత, సౌలభ్యం విషయంలో కాస్త మెరుగనే చెప్పుకోవాలి.
Admin
Studio18 News