Studio18 News - అంతర్జాతీయం / : Zelensky: సుదీర్ఘకాలంగా రష్యా – యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రాష్యాతో యుద్ధం ముగించడానికి తన ప్రణాళికలను యూరోపియన్ యూనియన్ నాయకులు, నాటో రక్షణ మంత్రులతో చర్చించేందుకు బ్రస్సెల్స్ లోని నాటో ప్రధాన కార్యాలయంలో యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటోలోకి ఉక్రెయిన్ కు ప్రవేశం కల్పించకపోతే రక్షణకోసం అణ్వాయుధాలను అనుసరించాల్సి ఉంటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అన్నట్లు పేర్కొన్నారు. నాటోలో బిడ్ పై తాను ట్రంప్ పై ఒత్తిడి తెచ్చానని.. ఇందుకు కారణం.. 1994 భద్రతా హామీలు విఫలం అవ్వటమేనని జెలెన్స్కీ చెప్పారు. నాటో కూటమిలో యుక్రెయిన్ దేశం చేరడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ.. గత నెల యూఎస్ లోని న్యూయార్క్ నగరం ట్రంప్ టవర్ లో మేమిద్దరం కలుసుకున్నాం. 1994 బుడాపెస్ట్ మెమోరాండం గురించి ప్రస్తావించానని, దాని కింద రష్యా, యుకె, యుఎస్ దేశాలు యుక్రెయిన్‌కు భద్రతా హామీలను ఇచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ తో జరిగిన సంభాషణలో.. రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వ్యూహంపై చర్చించాము. యుక్రెయిన్ అణుశక్తిని బలోపేతం చేసుకుంటుంది. అది దేశానికి రక్షణగా ఉంటుంది. అణుశక్తి ఉపయోగం లేకుండా ఉండాలంటే ఒకరమైన కూటమి మద్దు ఉండాలి. అది నాటో కూటమి అయితే బాగుంటుంది. 32దేశాల అట్లాంటిక్ కూటమిలో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ తన ప్రాధాన్యతగా ఎంచుకున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ట్రంప్ నా మాట విన్నాడని నేను నమ్ముతున్నానని జలెన్స్కీ తెలిపారు. ట్రంప్ స్పందిస్తూ.. మీ వాదనలు న్యాయమైనవి.. ఇది ముఖ్యమైనదని నేను భావిస్తున్నానని చెప్పారని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి తాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లతో కూడా చర్చించినట్లు జెలెన్స్కీ చెప్పారు. రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ నుంచి భద్రతా హామీలకు బదులుగా 1994లో బుడాపెస్ట్ మెమోరాండమ్ పై సంతకం చేయడంతో యుక్రెయిన్ తన అణు ఆయుధగారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. మెమోరాండంకు ముందు.. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత యుక్రెయిన్ తన గడ్డపై ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణు నిల్వలను కలిగి ఉంది. అణు నిరాయుధీకరణను స్వచ్చందంగా స్వీకరించిన బెలారస్, కజాఖస్థాన్, దక్షిణాఫ్రికాతో పాటు నాలుగు దేశాల్లో ఉక్రెయిన్ ఒకటని జలెన్స్కీ చెప్పారు. ఇప్పటికీ జెలెన్స్కీ అణ్వాయుధాల కంటే నాటోలో సభ్యత్వాన్ని ఎంచుకుంటున్నానని నొక్కి చెప్పారు. మరోవైపు.. ఉత్తర కొరియాపై జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తర కొరియాకు చెందిన 10వేల మంది సైనికులు వారి స్వదేశంలో శిక్షణ పొందుతున్నారు. యుక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో మూడో దేశం పాల్గొనడం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని జెలెన్స్కీ పేర్కొన్నారు. జెలెన్స్కీ చేసిన ఆరోపణలపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్టే స్పందించారు. యుద్ధంలో ఉత్తర కొరియా పాల్గొంటున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. రష్యా – యుక్రెయిన్ ల మధ్య యుద్ధంలో ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాల సరఫరాలో మాత్రమే సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
Admin
Studio18 News