Studio18 News - జాతీయం / : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు సహా ఏపీ, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు పోటెత్తే అవకాశం ఉండడంతో తమ వాహనాలు ధ్వంసం కాకుండా రక్షించుకునేందుకు చెన్నై వాసులు తమ కార్లను బ్రిడ్జిలపై ఒకవైపుగా పార్కింగ్ చేస్తున్నారు. బ్రిడ్జిలపై వాహనాలను పార్కింగ్ చేయవద్దని, జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహన యజమానులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాహనాలు పాడైతే రిపేరు చేయించుకునేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే జరిమానాలు కట్టడమే సులభమని భావిస్తున్న యజమానులు బ్రిడ్జిలపై వాహనాలను పార్కింగ్ చేసి వెళ్లిపోతున్నారు. మరీ ముఖ్యంగా వరద ప్రభావం ఉండే అవకాశం ఉన్న వెలచేరి బ్రిడ్జిలపై ఎక్కడ చూసినా పార్కింగ్ వాహన క్యూలు కనిపిస్తున్నాయి.
Admin
Studio18 News