Studio18 News - అంతర్జాతీయం / : Middle East Crisis : మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెరిగాయి. హెజ్బొల్లా అన్నంత పని చేసింది. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ ఆర్మీ బేస్ పై అటాక్ చేసింది. హైఫాలోని బిన్యామినా సమీపంలో డ్రోన్ దాడికి పాల్పడింది హెజ్బొల్లా. ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. 60 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్ సైనికులే టార్గెట్ గా ఈ దాడికి తెగబడింది హెజ్బొల్లా. కాగా, ఈ అటాక్ లో ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ మృతి చెందారంటూ ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా చేసిన అతి పెద్ద దాడి ఇదే. హైఫా టార్గెట్ గా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో పలువురు ఇజ్రాయెల్ పౌరులు మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైనికులే లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. టెంట్లు వేసుకుని ఉన్న సైనికులపై ఈ అటాక్ జరగ్గా.. పలువురు సైనికులతో పాటు స్థానికులు కూడా గాయపడ్డారు. అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా అరుపులు, కేకలు, బాంబుల మోతలతో దద్దరిల్లింది. హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారం తప్పదని హెజ్బొల్లా హెచ్చరించింది. ఇక తమకు నాయకత్వ సమస్యే లేదని హెజ్బొల్లా చెబుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇజ్రాయెల్ పై రివెంజ్ అటాక్ కు దిగింది. హైఫా నార్త్ ఇజ్రాయెల్ లో ఉంటుంది. అక్కడ ఇజ్రాయెల్ నావల్ బేస్ ఉంది. ”హైఫా సమీపంలోని స్టెల్లా మారిస్ నావికా స్థావరంపై హెజ్బొల్లా యోధులు రాకెట్ దాడి చేశారు. మా నాయకుడు హసన్ నస్రల్లా సేవలకు గుర్తుగా ఈ దాడి జరిగింది” అని లెబనీస్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గత నెలలో బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో నస్రల్లా మరణించారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ చేస్తోంది. సెంట్రల్ గాజాలోని అల్ అక్సా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ అటాక్ లో అక్కడ వేసిన టెంట్లు మంటల్లో కాలిపోయాయి. నిర్వాసితులైన పాలస్తీనియన్ల కోసం అక్కడ టెంట్లు వేశారు. అవన్నీ మంటల్లో కాలిపోయాయి. క్యాంప్ లో మంటలు చెలరేగడంతో అక్కడున్న పౌరులు హాహాకారాలు చేశారు. మంటలు ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బాంబు దాడిలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ మరోసారి దాడికి తెగబడిందని గాజా అధికారులు తెలిపారు.
Admin
Studio18 News