Studio18 News - అంతర్జాతీయం / : దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. భారీగా మిలటరీ ఉండే దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద రోడ్లను కూల్చివేయడానికి ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా తెలిపింది. “ఉత్తర కొరియా సైనికులు పశ్చిమ, తూర్పు తీరాలకు సమీపంలో ఉన్న సరిహద్దుల్లోని రోడ్లపై రహస్యంగా పనికానిచ్చేస్తున్నారు. వారు రోడ్లను పేల్చివేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది” అని దక్షిణ కొరియా సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. గత వారం ఉత్తర కొరియా సైన్యం కూడా ఓ ప్రకటన చేస్తూ.. దక్షిణ కొరియాతో అనుసంధానించిన రోడ్లు, రైలు మార్గాలను పూర్తిగా కట్ చేసి తమ సరిహద్దులో ఉన్న ప్రాంతాలను పటిష్ఠం చేస్తామని చెప్పింది. దక్షిణ కొరియా తమ రాజధాని ప్యోంగ్యాంగ్ మీదుగా డ్రోన్లను పంపిందని ఉత్తర కొరియా తెలిపింది. మరోసారి ప్యోంగ్యాంగ్ వద్దకు డ్రోన్లను పంపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర కొరియా వార్నింగ్ ఇచ్చింది. తాము సరిహద్దుల వద్ద ఎనిమిది పూర్తి స్థాయి సాయుధ ఆర్టిలరీ యూనిట్లను ఏర్పాటు చేశామని, దక్షిణ కొరియా ఏదైనా చర్యలకు పాల్పడితే కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా చెప్పింది. ఉత్తర కొరియా ఆరోపణలపై దక్షిణ కొరియా స్పందించలేదు.
Admin
Studio18 News