Studio18 News - జాతీయం / : Wedding Business : కల్యాణ ఘడియలు వచ్చేశాయి. పెట్టండి ముహూర్తాలు.. బుక్ చేయండి ఫంక్షన్ హాళ్లు.. మోగించండి బాజా భజంత్రీలు.. మూడు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత పెళ్లిళ్ల కోసం మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పటి నుంచి ఇయర్ ఎండింగ్ వరకు అంతా శుభ సమయమే. మూడు ముళ్లు, ఏడు అడుగులు, నూరేళ్ల బంధానికి ఆహ్వానం పలికే సమయం వచ్చేసింది. ఎప్పటి నుంచి మంచి రోజులు ఉన్నాయి, బలమైన ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి.. పెళ్లి అంటే.. లక్షల కోట్ల రూపాయల వ్యాపారం.. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడు అడుగులు మాత్రమే కాదు. ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలతో పాటు.. లెక్కలేనంత ఖర్చు కూడా ఉంటుంది. భారత దేశంలో వివాహం అంటే ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. సామాన్య జనం కూడా తాహతుకు మించి వివాహ తంతును జరిపిస్తారు. అందుకే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. భారత్ లో ఏటా దాదాపు కోటి వివాహాలు జరుగుతాయి. మరి ఈ సీజన్ లో ఎన్ని పెళ్లిళ్లు జరగబోతున్నాయి? ఎన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా ఉంది? బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లలో ఎక్కువ భాగం వివాహాలవే.. 2023 సంవత్సరంలో ఇదే సీజన్ లో దాదాపు 35 లక్షల వివాహాలు జరిగాయి. అప్పుడు దాదాపు 4.25 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఈసారి 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. తద్వారా వ్యాపారం మరింత పెరుగుతుందని లెక్క గట్టారు. సీఏఐటీ ప్రకారం ఒక్కో పెళ్లికి సగటున రూ.12 లక్షలు ఖర్చు చేస్తారు. పెళ్లిళ్ల సీజన్ లో వధూవరులు, కుటుంబసభ్యులు మాత్రమే కాదు.. ఈ సమయంలో మొత్తం మార్కెట్ కూడా పెళ్లి సన్నాహాల్లో పూర్తిగా బిజీగా ఉంటుంది. బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లలో ఎక్కువ భాగం వివాహాలవే. పెళ్లి బట్టలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దీంతో ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్లు, టెక్స్ టైల్ పరిశ్రమలకు పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి. మొత్తం పెళ్లి ఖర్చులో క్యాటరింగ్, కల్యాణ మండపాలకు 30శాతం ఖర్చు చేస్తున్నట్లు సీఏఐటీ అంచనా వేసింది.
Admin
Studio18 News