Studio18 News - అంతర్జాతీయం / : Donald Trump: అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ప్రపంచ దేశాల అధినేత గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. మోదీ నాకు మిత్రుడు మాత్రమే కాదు.. మంచి మనిషి అంటూ ట్రంప్ పేర్కొన్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికాలో నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమం గురించి ప్రస్తావించిన ట్రంప్.. అమెరికాలోని టెక్సాస్ లో 2019 సెప్టెంబరులో నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. భారత్ – పాక్ ఉద్రిక్తతలకు సంబంధించిన అంశంపై ట్రంప్ మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో భారత్ ను ఓ దేశం బెదిరించే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో నేను మోదీతో మాట్లాడాను. నన్ను సహాయం చేయనివ్వండి.. ఆ దేశంతో నాకు సఖ్యత ఉంది. నేను మాట్లాడతాను అని మోదీతో చెప్పానని.. అయితే, మోదీ మాత్రం ఈ వ్యవహారాన్ని తాను చూసుకోగలనని, అవసరమైతే ఎలాంటి చర్యకైనా తాము సిద్ధంగా ఉన్నామని మోదీ అన్నాడని ట్రంప్ చెప్పుకొచ్చారు. మేము దశాబ్దాల తరబడి వారిని ఓడించామని మోదీ అనడంతో ఆశ్చర్యానికి గురయ్యానని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు.. ఆ తరువాత పరిస్థితి గురించి వివరించారు. ఈ క్రమంలో మోదీ సాధించిన ఘనతలను గుర్తుచేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. అధ్యక్ష ఎన్నికలకు మరో నెల రోజుల వ్యవధి ఉన్న సమయంలో ట్రంప్ భారత ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.
Admin
Studio18 News