Studio18 News - అంతర్జాతీయం / : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను నాసా, స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ ద్వారా తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గురించి నాసా మరో విషయాన్ని తెలిపింది. అంతరిక్ష కేంద్రంలోని రష్యన్ విభాగంలో నిరంతరాయంగా గాలి లీక్ అవుతోందని చెప్పింది. గాలి లీక్ రేటును తగ్గించడంలో ఇటీవలి పురోగతి సాధించినప్పటికీ ఇప్పటికే చాలా గ్యాస్ లీక్ అయినట్ల తెలిపింది. గ్యాస్ లీక్ సమస్యను మొదటిసారిగా జ్వెజ్డా మాడ్యూల్ పీఆర్‌కే వెస్టిబ్యూల్‌లో 2019లో గుర్తించారు. దాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాసా తాజాగా తెలిపిన వివరాల ప్రకారం.. 2024 ఏప్రిల్ నుంచి రోజుకు దాదాపు 1.7 కిలోగ్రాముల గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర ప్రోగ్రామ్ ప్రమాద స్థాయికి పెరుగుతోంది. ప్రస్తుతం గ్యాస్ లీక్ సమస్యను తగ్గిస్తున్నారు. ఇటీవల జరిపిన రిపైర్‌తో లీకేజీ రేటును సుమారు మూడింట ఒక వంతు తగ్గించారు. గ్యాస్ లీకేజీ కొనసాగితే మరిన్ని సమస్యలు తలెత్తుతాయని నాసా అధికారులు అంటున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 వరకు సమర్థంగా వాడుకోవాలని నాసా భావిస్తోంది. ఆ తర్వాత దాన్ని కూల్చేసి పసిఫిక్ మహా సముద్రంలో పడేస్తారు. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌కు సంబంధించి నాసా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
Admin
Studio18 News