Studio18 News - అంతర్జాతీయం / : Mount Everest : మౌంట్ ఎవరెస్ట్.. ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం. ప్రతి ఏటా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతూనే ఉంది. మరి దీనికి కారణం ఏంటి? సైంటిస్టులు ఏం చెబుతున్నారు? కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ పర్వత శిఖరం ఎత్తు పెరుగుతూనే ఉంది. ప్రతి ఏటా 2ఎంఎం ఎత్తు పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఈ పర్వత శిఖరం ఎత్తు 8,848.6 మీటర్లు. సముద్ర మట్టానికి 8.85 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఈ శిఖరం ఎత్తు వేగంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎందుకిలా పెరుగుతోంది.. దానికి కారణం ఏంటి? అనే విషయాలను యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు వెల్లడించారు. భూమిలో నిరంతరం జరిగే అనేక రకాల మార్పులే ఇందుకు కారణమని వారు అంటున్నారు. శిఖరం ఎత్తు పెరగడానికి మరో ప్రధాన కారణం ఓ నది అని చెబుతున్నారు. అవును.. ఓ నది వల్లనే ఇలా జరుగుతోందని గుర్తించారు. దాని కారణంగా 15 నుంచి 50 మీటర్ల వరకు శిఖరం ఎత్తు పెరిగిందన్నారు. ఈ నది కారణంగా పెద్దఎత్తున భూమి కోతకు గురవుతోంది. భూమిపైన ఉన్న రాక్ సాయిల్ కొట్టుకుపోయింది. దాంతో అక్కడ ఒత్తిడి తగ్గి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరుగుతోందని వెల్లడించారు. ఒక్క ఎవరెస్ట్ శిఖరమే కాదు.. దాని పక్కనే ఉన్న ఇతర పర్వత శిఖరాలు సైతం ఇంకా ఎత్తు పెరుగుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది సుదీర్ఘమైన జియోలాజికల్ మార్పు అని వారు వివరించారు. సుదీర్ఘ కాలంగా భూమి లోపల జరుగుతున్న మార్పుల పరిణామక్రమంలో ఈ పర్వత శ్రేణి ఎత్తు పెరుగుతోందని పరిశోధకులు వివరించారు. ”నది పరివాహక ప్రాంతంలో భూమి కోతకు గురవుతోంది. దాంతో అక్కడ ఒత్తిడి తగ్గిపోతోంది. దాని వల్లే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏడాదికి 2 మిల్లీమీటర్ల వరకు పెరుగుతోంది” అని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు పేర్కొన్నారు.
Admin
Studio18 News