Studio18 News - అంతర్జాతీయం / : నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వినియోగించుకోనున్నారు. ఐఎస్ఎస్‌లో కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె భూమికి 400 కిలోమీటర్ల పైనుంచి తన ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోబోతున్నారు. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు 1997లో అందుబాటులోకి వచ్చింది. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న తొలి అమెరికన్‌గా డేవిడ్ వోల్ప్ రికార్డులకెక్కారు. మిర్ స్పేస్ స్టేషన్ నుంచి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత (2020) ఎన్నికల్లో కేట్ రూబిన్స్ కూడా ఇలానే ఓటేశారు. ఇప్పుడు సునీత కూడా వారి సరసన చేరనున్నారు. విదేశాల్లో ఉన్న అమెరికన్లు ఎలాగైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో అలానే సునీత కూడా ఓటేయనున్నారు. సునీత తొలుత ఫెడరల్ పోస్ట్ కార్డు అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చాక ఐఎస్ఎస్ కంప్యూటర్ సిస్టం నుంచి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పద్ధతిలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకుంటారు.
Admin
Studio18 News