Studio18 News - క్రీడలు / : యూఏఈ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ గురువారం ప్రారంభమైంది. పాకిస్థాన్, శ్రీలంక జట్లు బోణీ కొట్టాయి. ఈ మ్యాచుల్లో బౌలర్ల హవా కనిపించడంతో లోస్కోర్లు నమోదు అయ్యాయి. కాగా.. రెండు మ్యాచుల్లో నాలుగు దేశాల ప్లేయర్లు కలిపి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 మ్యాచులను జారవిడిచారు. ఏదో దేశవాలీ టోర్నీలో ఇలా జరిగితే పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు గానీ ఐసీసీ మెగా టోర్నీలో ఇలా జరగడం గమనార్హం. క్రికెట్ లో ఒక్క క్యాచ్ మిస్ చేస్తేనే దాని ఫలితం మ్యాచ్ పై పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఇన్ని క్యాచులు మిస్ అయ్యాయి అంటే దాని ఎఫెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఐసీసీ మెగా టోర్నీయేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచులో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయగా బంగ్లా ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను మిస్ చేశారు. ఇక ఆ తరువాత స్కాట్లాండ్ ప్లేయర్లు తామేమీ తక్కువ కాదన్నట్లు మూడు క్యాచులను నేలపాలు చేశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తరువాత శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు మూడేసి చొప్పున క్యాచులను మిస్ చేశాయి. ఈ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలుపొందింది.
Admin
Studio18 News