Studio18 News - జాతీయం / : వి.డి సావర్కర్ మాంసాహారేనని, ఆయనేమీ గోహత్యకు వ్యతిరేకం కాదని కాంగ్రెస్ నేత, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దినేశ్ గుండూరావు మాట్లాడారు. సావర్కర్ ఇతర మాంసాహారం మాత్రమేగాక గో మాంసం కూడా తినేవారని, అంతేగాక ఆ పద్ధతిని బహిరంగంగా ప్రచారం చేశారని చెప్పారు. సావర్కర్ బ్రాహ్మణుడేనని, అయినప్పటికీ ఆయన సంప్రదాయంగా వచ్చే ఆహార అలవాట్లను పాటించలేదని తెలిపారు. సావర్కర్ ఈ విషయంలో ఓ ఆధునిక వాది అని గుండూరావు చెప్పారు. మహాత్మా గాంధీ ప్రజాస్వామ్యాన్ని నమ్మితే, సావర్కర్ మాత్రం మతవాదాన్ని నమ్ముకున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ హిందూ సాంస్కృతిక సంప్రదాయవాదంపై ప్రగాఢ నమ్మకంతో కఠినమైన శాకాహార పద్ధతుల్ని పాటించేవారని తెలిపారు. సావర్కర్‌పై మాత్రమే కాకుండా మహ్మద్ అలీ జిన్నా గురించి కూడా గుండూరావు మాట్లాడుతూ… జిన్నా మరో విధమైన తీవ్రవాదానికి ప్రాతినిధ్యం వహించాడని అన్నారు. జిన్నా తీవ్ర ఇస్లామిస్ట్ కాదని, అతను పంది మాంసం కూడా తినేవాడని కొందరు చెబుతుంటారని తెలిపారు. ముస్లింలకు జిన్నా ఓ ఐకాన్ అయ్యాడని, అతను ఛాందసవాది కాదని, కానీ, సావర్కర్ మాత్రం ఛాందసవాది అని చెప్పారు.
Admin
Studio18 News