Studio18 News - జాతీయం / : Virender Sehwag Election Campaigning: హర్యానా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. రాష్ట్రంలోని 90అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అయితే, హర్యానా ఎన్నికల ప్రచారంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పాల్గొన్నాడు. హర్యానాలోని తోషమ్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సెహ్వాగ్ ప్రచారం నిర్వహించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తోషమ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ చౌదరి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో బీసీసీఐ కోశాధికారిగా కొనసాగారు. అనిరుధ్ చౌదరి మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ పెద్ద కుమారుడైన రణవీర్ సింగ్ మహేంద్ర కుమారుడు. అనిరుధ్ తండ్రి రణవీర్ సింగ్ మహేంద్ర గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అనిరుధ్ చౌదరి తరపున ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. అనిరుధ్ చౌదరిని నేను అన్నయ్యగా భావిస్తాను. తన తండ్రి రణబీర్ సింగ్ మహేంద్ర కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మాకు కుటుంబ సబంధాలు ఉన్నాయని అన్నారు. చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించాలని తోషం నియోజకవర్గం ప్రజలకు సెహ్వాగ్ విజ్ఞప్తి చేశారు. వీరేంద్ర సెహ్వాగ్ వారంరోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు. అందులో అతను కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిరుధ్ చౌదరికి మద్దతు ఇస్తున్నట్లు కనిపించాడు. ఆ తరువాత సెహ్వాగ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలుసైతం విస్తృతంగా ప్రచారం అయ్యాయి. సెహ్వాగ్ పోస్టు చేసిన వీడియోలో.. నేను ఏ పనిచేసినా మీ ప్రేమ వల్ల చేస్తాను.. మీ సపోర్ట్ వల్ల చేస్తాను, మీ సహకారం వల్ల చేస్తాను. మీకు నాకు మధ్య మూడో వ్యక్తి ఉండడు అని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి అనిరుధ్ చౌదరి చెప్పారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో సెహ్వాగ్ షేర్ చేశాడు. తాజాగా అనిరుధ్ చౌదరికి మద్దతుగా ప్రచారంలో సెహ్వాగ్ పాల్గొన్నాడు.
Admin
Studio18 News