Studio18 News - అంతర్జాతీయం / : Israel Iran Conflict: హెజ్బెల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్ పై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ క్షిపణుల దాడులకు దిగడంతో.. వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు బాంబు షెల్టర్‌లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్ సైతం ఇరాన్ పై దాడులకు సిద్ధమవుతోంది. ఇరాన్ దాడిని అమెరికా, బ్రిటన్, తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లు ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ కు అమెరికా ప్రధాన మిత్ర దేశం అనే విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ కు దౌత్యపరమైన మద్దతు ప్రకటించిన అమెరికా సైనిక సామాగ్రిని కూడా అందిస్తూ అండగా నిలుస్తోంది. తాజాగా.. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దాడులు పాఠశాలలో ఇద్దరు చిన్న పిల్లల మధ్య కొట్లాటలా ఉందని అభివర్ణించారు. యూఎస్ ఎక్కువగా జోక్యం చేసుకుంటుందని అన్నారు. నేను చాలా కాలంగా మూడవ ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతున్నాను.. నా అంచనాలు ఎప్పుడూ నిజమవుతాయని ట్రంప్ పేర్కొన్నారు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఎటువంటి యుద్ధాలు జరగలేదు. ఇరాన్ పూర్తిగా అదుపులో ఉందని అన్నారు. ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్షులు అసమర్ధులని, వారు యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం అందిస్తున్నారని బిడెన్, కమలా హారిస్ పై ట్రంప్ మండిపడ్డారు. ఈ దేశాన్ని నడుపుతున్న ఇద్దరు అసమర్ధులు యూఎస్ ను మూడో ప్రపంచ యుద్ధం అంచుకు నడిపిస్తున్నారని ట్రంప్ విమర్శలు చేశారు.
Admin
Studio18 News