Studio18 News - జాతీయం / : ఓ గ్రామ సర్పంచ్ పదవికి బహిరంగ వేలం నిర్వహించడం, ఆ పదవిని వేలంలో ఓ నేత రూ.2కోట్లకు దక్కించుకోవడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ వ్యాప్తంగా 13,237 సర్పంచి స్థానాలకు ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 4వ తేదీ నామినేషన్‌లకు తుది గడువు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటనలు వచ్చాయి. అయితే, ఈ పోలింగ్ ప్రక్రియతో సంబంధం లేకుండా ఓ గ్రామంలో సర్పంచి పదవికి వేలం పాట ద్వారా ఎన్నుకోవడం, అదీ రెండు కోట్ల వరకూ పలకడం తీవ్ర చర్చనీయాంశమైంది. గురుదాస్ పుర్‌లోని హర్దోవల్ కలన్ గ్రామంలో సర్పంచి పదవికి వేలం పాట నిర్వహించారు. రూ.50లక్షలతో వేలం మొదలు కాగా, స్థానిక బీజేపీ నేత అత్మాసింగ్ ఏకంగా రూ.2కోట్లకు పాడాడు. గ్రామానికి ఎవరు ఎక్కువ నిధులు ఇస్తారో వారినే సర్పంచిగా ఎన్నుకుంటారని సదరు నేత చెబుతున్నారు. ఈ వేలం పాట ఎన్నికపై రాజకీయ దుమారం చెలరేగడంతో అధికారులు స్పందించారు. గ్రామంలో జరిగిన ఈ వేలంపై జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. మరో వైపు సర్పంచ్ ఎన్నికకు ఆత్మాసింగ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచి పదవికి వేలం నిర్వహించడంపై అక్కడి కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ సర్పంచి పదవి వేలం అంశంపై తీవ్ర చర్చనీయాంశం కావడం, అధికార యంత్రాంగం సైతం స్పందించడంతో ఏమి జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Admin
Studio18 News