Studio18 News - అంతర్జాతీయం / : Iran Missile Attack in Israel: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ క్షిపణుల దాడులకు దిగడంతో.. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ల మోతతో ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో మిలియన్ల మంది ఇజ్రాయెల్ ప్రజలు బాంబు షెల్టర్‌లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్ పై తాము 180 క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ పేర్కొంది. భారీగా క్షిపణుల దాడులను ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టింది.. ఇరాన్ దాడి కారణంగా ఇజ్రాయెల్ లో ఎంత నష్టం జరిగిందనే విషయాలను పరిశీలిస్తే.. ఇరాన్ చేసిన దాడి చాలా వ్యూహాత్మకమైంది. ఇరాన్ మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను, టెల్ అవీవ్ లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ లోని నెవాటిమ్, హట్జెరిమ్, టెల్ నోఫ్ సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించారు. టెల్ నోఫ్, నెవాటిమ్ ఇజ్రాయెల్ ఆర్మీ ఐడీఎఫ్ కు చెందిన అత్యంత అధునాతన సైనిక స్థావరాలు. నెవాటిమ్ పై కొన్ని క్షిపణులు మాత్రమే పడినట్లు శాటిలైట్ పుటేజీ చూపిస్తుంది. ఇరాన్ జరిపిన ఈ దాడిలో ఒకరు మరణించగా.. ఒక ఇజ్రాయెల్ సైనికుడు గాయపడ్డాడు. ఇజ్రాయెల్ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో ఇరాన్ జరిపిన దాడులో నష్టం కనిపించింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ లో ఎవరూ మరణించినట్లు సమాచారం రాలేదని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. తాము ప్రయోగించిన క్షిపణుల్లో 90శాతం లక్ష్యాన్ని ఛేధించాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్( ఐఆర్జీసీ) చెబుతుండగా.. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు చాలా వరకు అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిలో చాలా క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకుందని యూఎస్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో గ్రౌండ్ లెవల్లో పెద్దగా నష్టం జరగలేదు. కానీ, పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసం అయ్యాయి. ఇజ్రాయెల్ దేశానికి చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (ఐరన్ డోమ్) ఇరాన్ సైన్యం ప్రయోగించిన క్షిపణులను సాధ్యమైనంత మేర అడ్డుకుంది. ఏప్రిల్ నెలలోకూడా ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూల్చేసింది. అయితే, ఈసారి ఇరాన్ భారీ మొత్తంలో క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. దీంతో పూర్తిస్థాయిలో ఇరాన్ క్షిపణులను అడ్డుకోవటంలో ఐరన్ డోమ్ విఫలమైనా.. ఇజ్రాయెల్ కు పెద్దెత్తున్న నష్టం జరగకుండా ఐరన్ డోమ్ సహాయపడింది. మరోవైపు మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ పై ప్రయోగించిన 90శాతం క్షిపణులు లక్ష్యాన్ని చేరుకున్నాయని ఐఆర్జీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ క్షిపణుల దాడితో ఆగ్రహంతో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిదాడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇరాన్ సైతం మేముకూడా సిద్ధమేఅని అనడంతో.. ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళనను ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి.
Admin
Studio18 News