Studio18 News - అంతర్జాతీయం / : Israel-Iran Tension Row: పశ్చిమాసియాలో క్షిపణుల మోత మోగుతోంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 400కిపైగా క్షిపణులను ప్రయోగించింది. ప్రజలను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ వారిని బాంబు షెల్టర్లలో ఆశ్రయం కల్పిస్తోంది. ఇరాన్ క్షిపణులను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ కు సహాయం అందించేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ కు సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఎస్సీ ప్రతినిధి సీన్ సావెల్ ట్విటర్ లో ఒక పోస్టు ప్రకారం.. ప్రెసిడెంట్ బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ వైట్ హౌస్ సిట్యుయేషన్ రూం నుంచి దాడిని పర్యవేక్షిస్తున్నారని, ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారని తెలిపారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అనే దానిపై లోతైన చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు బిడెన్ పేర్కొన్నారు. టెహ్రాన్ పర్యావసనాలు ఎలా ఎదుర్కొంటుందో చూడాలన్నారు. ఇప్పటికే నేతన్యాహుతో ఇరాన్ దాడి ఘటనపై మాట్లాడినట్లు తెలిపారు. కమలా హారిస్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక ప్రమాదకర దేశం.. అస్థిరపరిచే శక్తి అన్నారు. ఇజ్రాయెల్ భద్రతకు వాషింగ్టన్ కట్టుబడి తెలిపారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడి దేశంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్ భద్రత, ఆ దేశ ప్రజల భద్రతకోసం తమ దేశం నుంచి అన్నివిధాల సహకారం అందిస్తామని బ్రిటన్ ప్రధాని చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ లోని అమాయకులకు హాని కలిగించడానికి ఇరాన్ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపాడు. ఇదిలాఉంటే.. బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ ట్విటర్ లో ఓ పోస్టు చేశారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి చేయడం వల్ల తలెత్తిన పరిస్థితిని మరింత దిగజారకుండా నిరోధించడంలో బ్రిటీష్ మిలటరీ పాత్ర ఉందని చెప్పారు. అయితే, ఇందులో బ్రిటన్ ప్రమేయం ఎలా ఉందో ఆయన వివరించలేదు. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గేది లేదని, ఇజ్రాయెల్ పై మా పోరాటాన్ని అడ్డుకునేందుకు ఏ దేశమైనా తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాల కార్యకలాపాలపై ఇరాన్ ఆర్మీ దళాలు దాడులు చేస్తాయని తీవ్ర స్థాయిలో ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది.
Admin
Studio18 News