Studio18 News - అంతర్జాతీయం / : Israeli PM Benjamin Netanyahu: ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య కొనసాగుతున్న వివాదం ముగియడం లేదు. ఇజ్రాయెల్ కూడా అమెరికా ఇచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. హెజ్బుల్లాకు వ్యతిరేకంగా పూర్తిశక్తితో పోరాటం కొనసాగించాలని తన సైన్యాన్ని ఆదేశించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానికి ఇరాన్ కారణమని ఆరోపించారు. మీరు మమ్మల్ని కొడితే.. మేము మిమ్మల్ని కొడతాం. ఇరాన్ లో ఇజ్రాయెల్ వెళ్లని ప్రదేశం లేదంటూ నెతన్యాహు యూఎన్ వేదికగా ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. హెజ్బుల్లాను అణచివేయడంతోపాటు హమాస్ పై విజయం వరకు పోరాతామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే, నెతన్యాహు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగం సమయంలో రెండు మ్యాప్ లను చూపించాడు. అందులో ఒకటి ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ నలుపు రంగులో ఉండే మిడిల్ ఈస్ట్ మ్యాప్. దానిపై ‘ది శాపం’ అని రాసి ఉంది. ఎడమ చేతిలోని మ్యాప్ లో ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా, భారతదేశంతోసహా దేశాలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. దీనిపై ‘ది బ్లెస్సింగ్’ అని రాసిఉంది. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ఈ మ్యాప్ నుండి పాలస్తీనాను తొలగించేశారు. అంటే.. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల ప్రభుత్వాలు ఈ మ్యాప్ లను ఢీకోడింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. నెతన్యాహు చూపించిన మ్యాప్ ప్రకారం.. పాలస్తీనా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. యూఎన్ ప్రసంగంలో నెతన్యాహు ఇరాన్ పై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. లెబనాన్, సిరియా, యెమెన్ లలో జరుగుతున్న హింసాకాండకు ఇరాన్ కారణమని ఆయన ఆరోపించారు. లెబనాన్ లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్ లోని హౌతీలకు టెహ్రాన్ (ఇరాన్ రాజధాని) ఆర్థిక, సైనిక సహాయాన్ని అందిస్తోందని ఆరోపించారు. మరోవైపు లెబనాన్, చుట్టుపక్కల ఉన్న హెజ్బుల్లా బలగాలపై ఇజ్రాయెల్ వైమానిక బాంబు దాడితో వారంరోజుల్లో దాదాపు 700 మంది మరణించారు. అయితే, కాల్పుల విరమణ కోసం యూఎన్ నేతృత్వంలోని ప్రయత్నం విఫలమైంది. హెజ్బుల్లా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నంత కాలం ఇజ్రాయెల్ కు వేరే మార్గం లేదు.. ఈ ముప్పును తొలగించి, పౌరులను సురక్షితంగా ఇంటికి తిరిగి పంపించే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని యూఎన్ లో నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు జరుగుతున్నాయి. మేము మా లక్ష్యాలను చేరుకునే వరకు ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుందని యూఎన్ వేదికగా నెతన్యాహు స్పష్టం చేశారు.
Admin
Studio18 News