Studio18 News - అంతర్జాతీయం / : Israel-Lebanon Conflict: ఇజ్రాయెల్, లెబనాన్ (మిడిల్ ఈస్ట్ దేశం) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ కనీవినీ ఎరుగని స్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయన మరణించారా? లేదా సురక్షితమా? అనేదానిపై స్పష్టత రాలేదు. నస్రల్లా సజీవంగా ఉన్నాడని హెజ్బొల్లా వర్గాలు చెబుతున్నా.. ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ధ్రువీకరించుకోవాల్సి ఉందని అంటోంది. షియా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా నాయకుడు హజన్ నస్రల్లా 30 సంవత్సరాలకుపైగా సాయుధ బృందానికి నాయకత్వం వహించారు. గెరిల్లా సంస్థ నుంచి మధ్యప్రాచుర్యంలో అత్యుత్తమ సాయుధ నాన్ స్టేట్ ఫోర్స్ గా ఎదగడానికి అధ్యక్షత వహించారు. అతని ప్రభావంతో లెబనాన్ సరిహద్దులకు మించి విస్తరించి ఉంది. ప్రాంతం అంతటా ముస్లిం షియా సమూహాల నుంచి అనుచరులను కలిగి ఉంది. అయితే, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ)లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగించిన కొద్ది నిమిషాలకే హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. దక్షిణ లెబనాన్ లోని దాహియాలో నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బంకర్ బస్టర్ బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. దీంతో దాహియాతోపాటు, బీరూట్ లోని చాలా ప్రాంతాలు దద్దరిల్లాయి. భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. 76 మంది గాయపడ్డారు. ఈ ఘటన తరువాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రతినిధి డేనియల్ హగారి వీడియోను విడుదల చేశారు. ఐడీఎఫ్ హెజ్బుల్లా టెర్రర్ ఆర్గనైజేషన్ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ పై ఖచ్చితమైన దాడిని చేయడం జరిగిందని తెలిపారు. ఇజ్రాయెల్ కుటుంబాలు తమ ఇళ్లలో సురక్షితంగా నివసించడానికి మా ప్రజలను రక్షించడానికి అవసరమైన చర్యను తీసుకున్నాయని చెప్పాడు. లెబనాన్ తో సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య ఇజ్రాయెల్ సైన్యం ఉత్తరాన యుద్ధ ట్యాంకులను మోహరించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్, లెబనాన్ లను వేరుచేసే యూఎన్ నియమించిన బ్లూలైన్ వెంట ఇజ్రాయెల్ దళాలు, హెజ్బుల్లా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. లెబనాన్ లో ఇజ్రాయెల్ నిరంతరం వైమానిక దాడులు నిర్వహిస్తోంది. లెబనీస్ సాయుధ సమూహం హెజ్బుల్లా మరియు లెబనీస్ రాజకీయ పార్టీలతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ గురువారం ఖండించింది. కాల్పుల విరమణకు సంబంధించిన వార్తలు అవాస్తవమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా పరిస్థితులను చూస్తుంటే ఇజ్రాయెల్ – హెజ్బుల్లా ఘర్షణలు పెద్ద యుద్ధానికి సంకేతాలుగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదిలాఉంటే.. గత సోమవారం నుంచి ఇజ్రాయెల్ లెబనాన్ లో పెద్దెత్తున వైమానికి దాడులు చేసింది. ఈ దాడుల్లో 650 మందికిపైగా మరణించారు.. 2వేల మందికిపైగా గాయపడ్డారు. 1.50లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని లెబనాన్ పర్యారవణ మంత్రి నాసర్ యాసిన్ తెలిపారు
Admin
Studio18 News