Studio18 News - జాతీయం / : శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. పదిహేను రోజుల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా కూడా విధించింది. ఈమేరకు ఓ కేసులో గురువారం తీర్పు వెలువరించింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన భార్య డాక్టర్ మేధా కిరీట్ సోమయ్యలపై సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మీరా భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలో భారీ స్కాం జరిగిందని సంజయ్ రౌత్ గతంలో ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కిరీట్ సోమయ్య దంపతులు రూ.100 కోట్ల స్కాం చేశారని విమర్శించారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డ డాక్టర్ మేధా కిరీట్ సోమయ్య.. సంజయ్ రౌత్ పై పరువునష్టం దావా వేశారు. ఈ దావాను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్.. సంజయ్ రౌత్ నిరాధార ఆరోపణలు చేశారని నిర్ధారించారు. తప్పుడు ఆరోపణలు చేసి కిరీట్ సోమయ్య దంపతులకు పరువునష్టం కలిగించారని తేల్చి ఎంపీకి 15 రోజుల జైలు, రూ.25 వేల జరిమానా విధించారు.
Admin
Studio18 News