Studio18 News - జాతీయం / : ఎడతెరిపి లేని భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. పోవాయ్, ఘట్కోపర్‌లో ఐదు గంటల్లోనే ఏకంగా 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, థానేలోని ముంబ్రా బైపాస్‌లో కొండచరియలు విరిగిపడడంతో మూడు గంటలకుపైగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్రేన్ల సాయంతో బండరాళ్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ముంబై, థానేకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీచేశారు. నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అంధేరీలో ఓపెన్ డ్రెయిన్‌లో 45 ఏళ్ల మహిళ మృతి చెందగా, వర్షాల కారణంగా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వర్షాల నేపథ్యంలో 14 విమానాలను దారి మళ్లించారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రేపటి వరకు వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ముంబై, దాని శివారు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. వర్షాల నేపథ్యంలో ముంబైలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Admin
Studio18 News