Studio18 News - అంతర్జాతీయం / : US Election 2024 : అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో జరగనున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్ధి కమలాహారిస్, రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అయితే, ఎన్నికల సమయంలో అగ్రరాజ్యంలో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కాల్పులు అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ టార్గెట్ గా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ తృటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు. ఆయన చెవికి ఆనుకొని బుల్లెట్ వెళ్లింది. ఈ ఘటన అమెరికాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవల మరోసారి ట్రంప్ టార్గెట్ గా కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా నిందితుడు హత్యాయత్నం చేశాడు. ఫెన్సింగ్ వద్ద నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గమనించి భద్రతా సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కమలాహారిస్ టార్గెట్ గా కాల్పుల ఘటన చోటు చేసుకుంది. అరిజోనాలోని కమలాహారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలంకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అయితే, అర్థరాత్రి సమయం కావడం.. ఆ సమయంలో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. యూఎస్ లో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తుందని, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించినట్లు ట్రంప్ ప్రచార బృందం చెబుతోంది. అంతేకాక.. ఇరాన్ హ్యాకర్లు ట్రంప్ ప్రచారంలో బహిర్గతం కాని అంశాలను హ్యాక్ చేసి.. ఆ సారాంశాన్ని బైడెన్ ప్రచార సిబ్బందికి ఇచ్చేందుకు వారిని ఊరిస్తూ మెయిళ్లు పంపారని పలు ఏజెన్సీల అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల ట్రంప్ ప్రచారం హ్యాక్ అవడానికి ఇరాన్ కారణమని తాము భావిస్తున్నట్లు ట్రంప్ ప్రచార బృందం పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేసింది. ఏదిఎలా ఉన్నా.. అమెరికాలో మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. ట్రంప్, కమలాహారిస్ లు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న వేళ.. వారిద్దరు టార్గెట్ గా వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకోవటం అగ్రరాజ్యంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.
Admin
Studio18 News