Studio18 News - అంతర్జాతీయం / : PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మూడ్రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో ఆయన భారత్ కు బయలుదేరారు. న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భారత దేశానికి బయలుదేరారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ క్వాడ్ దేశాధినేతల సమ్మిట్ కు హాజరయ్యారు. న్యూయార్క్ లోని భారతీయ ప్రవాసులతో ‘మోదీ అండ్ యూఎస్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆ తరువాత ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ‘సమ్మిట్ ఆఫ్ ది ప్యూచర్’లో మోదీ ప్రసంగించారు. దీంతోపాటు తన పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూడ్ అబ్బాస్ తో జరిగిన సమావేశాలతో సహా కీలక ద్వైపాక్షిక సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. న్యూయార్క్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు నేపాల్, కువైట్, వియాత్నాం, పాలస్తీనా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోనూ ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోదీ సోమవారం న్యూయార్క్ లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇరువురు నేతల మధ్య ఇది రెండో సమావేశం కావటం విశేషం. ప్రధాని మోదీ ఈ ఏడాది ఆగస్టు 23న ఉక్రెయిన్ ను సందర్శించారు. ఉక్రెయిన్ లో శాంతిని త్వరగా తిరిగి పునరుద్దరించడానికి సాధ్యమైన అన్ని విధాలుగా సహకరించాలని భారతదేశం సహకారాన్ని జెలెన్ స్కీ ప్రధాని మోదీని కోరారు. ప్రధాని మోదీ, జెలెన్ స్కీ సమావేశం గురించి విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. ఈ సమావేశం ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్ధన మేరకు జరిగింది. గత మూడు నెలల్లో ఇరువురు నేతలు భేటీ కావడం ఇది మూడోసారి. ఇరు దేశాల అధినేతలు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ సమావేశంలో రష్యా చమురుపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు.
Admin
Studio18 News