Studio18 News - అంతర్జాతీయం / : PM Modi congratulates to Dissanayake: : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠగా సాగిన త్రిముఖ పోరులో చివరకు మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే పైచేయి సాధించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్క్సిస్టు విధానాల వైపు మొగ్గుచూపే దిసనాయకేను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తరువాత శ్రీలంక ఎన్నికల సంఘం 56ఏళ్ల దిసనాయకే అధ్యక్ష ఎన్నికల విజేతగా ప్రకటించింది. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన ఎన్నికల్లో విజేతగా ప్రకటించేందుకు అవసరమైన ఓట్లలో ఏ అభ్యర్థి 50శాతానికి మించి సాధించకపోవడంతో ఎన్నికల సంఘం రెండో రౌండ్ ఓట్ల లెక్కింపునకు ఆదేశించింది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో 42.13శాతం ఓట్లతో దిసనాయకే అధ్యక్ష పదవికి మొదటి ఎంపికగా నిలిచారు. పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మూడో స్థానానికి పడిపోయారు. ఆయనకు 17.27శాతం ఓట్లు వచ్చాయి. దిసనాయకే ఎన్నికల్లో విజయం తరువాత మాట్లాడుతూ.. తన విజయం ప్రజల విజయమని చెప్పారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిసనాయకేను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం యొక్క నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ, విజన్ సాగర్ లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉంది. రెండు దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నానని దిసనాయకేను ఉద్దేశిస్తూ మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు.
Admin
Studio18 News