Studio18 News - జాతీయం / : ISRO Chairman Dr S Somanath: చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు చంద్రయాన్-4పై దృష్టి పెట్టింది. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సమావేశమైన కేంద్ర మంత్రివర్గం అంతరిక్ష మిషన్‌లకు రూ.31,772 కోట్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో 2040 వరకు ఇస్రో పరిశోధనలు, ప్రయోగాలు చేసుకోవడానికి గట్టి పునాది వేసినట్లు అయింది. ఈ మిషన్లలో చంద్రయాన్-4, వీనస్ మిషన్, గగన్‌యాన్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ చంద్రయాన్-4కు సంబంధించిన వివరాలు తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ఇస్రో తన వంతు తోడ్పాటునందిస్తుందని చెప్పారు. చంద్రయాన్-4కి కేంద్రం రూ.2,104 కోట్లు కేటాయించింది. చంద్రుడిపై చంద్రయాన్-3 మిషన్ కాలు మోపిన ‘శివశక్తి’ ప్రాంతం నుంచి రాళ్లు, మట్టి శాంపుళ్లను తీసుకురావడమే లక్ష్యంగా చంద్రయాన్-4 మిషన్‌ను చేపట్టారు. అలాగే, 2040 నాటికి చంద్రుడిపై మనుషులు కాలు పెట్టేలా భారత్ పెట్టుకున్న లక్ష్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. చంద్రుడి భూగర్భం గురించి భారత్ శాస్త్రీయంగా మరింత అవగాహనకు వస్తుందని సోమ్‌నాథ్ అన్నారు. చంద్రయాన్-3 మిషన్ జాబిల్లిపై ఓ ప్రదేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం సాధ్యమవుతుందని నిరూపించిందని ఆయన తెలిపారు. అలాగే శాస్త్రీయ ప్రయోగాలను కూడా ఆ మిషన్ చాలా బాగా చేసిందని చెప్పారు. ఇక తదుపరి దశ చంద్రుడిపైకి వెళ్లి సురక్షితంగా తిరిగి రావడమేనని అన్నారు. అందుకు మనం అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఆ సాంకేతికతను సంపాదించడం కూడా చంద్రయాన్-4లో భాగమేనని తెలిపారు. శాంపిల్ సేకరణ వంటి సైంటిఫిక్ మిషన్లు కూడా ఉండాలని అన్నారు. చంద్రుడి నుంచి ఏదైనా భూమిమీదకు తీసుకురావాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయని చెప్పారు. భూమిని కొద్దిగా తొవ్వి, వేర్వేరు చోట్ల నుంచి శాంపుల్స్ సేకరించాల్సి ఉంటుందని, రోబోటిక్ యాక్టివిటీతో దాన్ని సేకరించి, ఆ తర్వాత కంటైనర్‌లో నిల్వ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ఆ కంటైనర్‌ను ల్యాండర్ ఉండే చోటుకు పంపాలని, ఆ తర్వాత చంద్రుడి నుంచి భూమి మీదకు అది వస్తుందని చెప్పారు. క్లిష్టతరమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Admin
Studio18 News