Studio18 News - జాతీయం / : వందేభారత్ రైలుకు జెండా ఊపుతూ యూపీ బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయారు. ఇటావా రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. ప్లాట్‌ఫాంపైకి వస్తున్న ఆగ్రా-వారణాసి రైలుకు బీజేపీ నేతలు జెండా ఊపుతున్న సమయంలో జనాలు కిక్కిరిసిపోయి ఉండడంతో ఇటీవా సర్దార్ ఎమ్మెల్యే సరితా భదౌరియా అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వస్తున్న రైలుకు స్వాగతం చెప్పేందుకు రైల్వే స్టేషన్‌కు జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఒకానొక సమయంలో పరిస్థితి అదుపుతప్పేలా కనిపించింది. ఎమ్మెల్యే కిందపడిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిందికి దిగి ఆమెను లేవనెత్తారు. పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్ కిక్కిరిసిపోయేలా జనాన్ని అనుమతించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, రైలుకు స్వాగతం పలికేందుకు బీజేపీ ఇటావా మాజీ ఎంపీ రామశంకర్ కతేరియా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జితేంద్ర ధోరే మద్దతుదారులు పోటీపడ్డారు.
Admin
Studio18 News