Studio18 News - అంతర్జాతీయం / : ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని, పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తాను తప్పుకున్నట్టు బుధవారం పేర్కొన్నారు. పార్టీ బాధ్యతలను యువతరానికి బదిలీ చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు ఇది వరకే మద్దతు తెలిపిన బైడెన్ తాజాగా ప్రసంగంలో ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమె కచ్చితమైన, సమర్థురాలైన ఉపాధ్యక్షురాలని కొనియాడారు. ‘‘ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్య పరిరక్షణ ముందు ఏ పదవీ ఎక్కువ కాదు. కాబట్టి, ఈ బాధ్యతలను తరువాతి తరానికి అందించాలని నిర్ణయించాను. దేశాన్ని ఏకం చేసేందుకు, యువ గొంతులు వినిపించేందుకు ఇదే సరైన మార్గం’’ అని అన్నారు. ప్రసంగ సమయంలో బైడెన్ భార్య జిల్, కూతురు ఆశ్లే ఆయన వెంట ఉన్నారు. ఆ తరువాత జిల్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. బైడెన్‌కు నిరంతరంగా మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక తప్పుకోవడంతో అమెరికా రాజకీయాల్లో అత్యంత వృద్ధ నేతగా ట్రంప్ నిలిచారు. ఇక, బైడెన్ స్పీచ్ అనంతరం, ట్రంప్ ఆయనపై విరుచుకుపడ్డారు. బైడెన్ ప్రసంగం అర్థరహితంగా ఉందని మండిపడ్డారు. మరోవైపు, అమెరికాలో అధికార మార్పిడి తప్పదన్న సంకేతాల నడుమ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బైడెన్‌తో గురువారం సమావేశం కానున్నారు. అనంతరం, ఆయన కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌తో కూడా సమావేశం అవుతారు.
Admin
Studio18 News