Studio18 News - అంతర్జాతీయం / : US Elections 2024: అమెరికాలో ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గోల్ఫ్ కోర్టు వద్ద అనుమానాస్పదంగా తుపాకీతో తిరుగుతుండటంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. వెంటనే అతడు పారిపోవడంతో వెంబడించి పట్టుకున్నారు. ఘటన స్థలిలో ఏకే 47 మోడల్ వంటి తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో చోటు చేసుకుంది. సీక్రెట్ సర్వీస్ అధికారులు ట్రంప్ ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన తరువాత డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. నేను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. గోల్ఫ్ ఆడుతుండగా నాకు కొద్దిదూరంలో కాల్పుల శబ్దం వినిపించింది. అయితే, నేను క్షేమంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేరు. నేను ఎప్పటికీ లొంగిపోను అని ట్రంప్ పేర్కొన్నారు. గోల్ఫ్ కోర్టులోకాల్పుల ఘటన తరువాత తన మార్ -ఎ- లాగో రిసార్ట్ కి వెళ్లానని ట్రంప్ చెప్పారు. ఇదిలాఉంటే.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ట్రంప్ ను లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పులు జరిగాయా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తాజా ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందింది. అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. గత జులై నెలలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా.. థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ట్రంప్ చెవికి స్వల్పంగా గాయమైన విషయం తెలిసిందే. మరోసారి ట్రంప్ గోల్ప్ కోర్టులో ఉండగా సమీపంలో ఓ వ్యక్తి ఏకే 47 మోడల్ గన్ ను పట్టుకొని తిరగడం ట్రంప్ మద్దతుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా ఘటనపై ఎలాన్ మస్క్ ఎక్స్ ఖాతాలో స్పందించారు. ఎవరూ జో బిడెన్, కమలా హారిస్ ను హత్య చేయడానికి కూడా ప్రయత్నించడం లేదు అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.
Admin
Studio18 News