Studio18 News - అంతర్జాతీయం / : ఎలాన్ మస్క్‌కు చెందిన ”స్పేస్ ఎక్స్” చరిత్ర సృష్టించింది. ఈ ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థ మొట్టమొదటిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించగా, అది విజయవంతమైంది. పోలారిస్ డాన్ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టగా, మంగళవారం నలుగురిని స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ సాయంతో భూ కక్ష్యలోకి పంపారు. గురువారం సాయంత్రం 4.22 గంటలకు అంతరిక్ష నౌక రెసీలియన్స్ నుంచి పారిశ్రామికవేత్త జారెడ్ ఐజక్‌మన్ బయట అడుగుపెట్టారు. ఈ మిషన్‌కు నేతృత్వం వహించింది ఆయనే. కమర్షియల్ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్ వాక్ చేసిన మొట్టమొదటి నాన్ ప్రొఫెషనల్ సిబ్బందిగా జారెడ్ ఐజక్‌మన్ రికార్డు సృష్టించారు. అనంతరం 15 నిమిషాల తర్వాత సారా గిల్లిస్ అనే వ్యక్తి కూడా అంతరిక్ష నౌక నుంచి బయటకు వచ్చారు. స్పేస్ వాక్ చేస్తోన్న సమయంలో ఐజక్‌మన్ మాట్లాడుతూ.. తిరిగి భూమిపైకి వెళ్తే తాము చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయని, అయితే, అంతరిక్షం నుంచి చూస్తే భూమి ఓ సమగ్ర ప్రపంచంలా కనపడుతోందని చెప్పారు. ఐజక్‌మన్ ఎవరో కాదు.. షిఫ్ట్ 4 వ్యవస్థాపకుడు. ఐజక్‌మన్, ఆ తర్వాత గిల్లిస్ భూమి నుంచి 700 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్‌లో ఉన్న దృశ్యాలను స్పేస్ ఎక్స్ సామాజిక మాధ్యమాల్లో చూపించింది. అంతరిక్షంలో ఇంతకు ముందు వరకు గవర్నమెంట్ నిధులతో పరిశోధనలు చేసే అంతరిక్ష సంస్థలకు చెందిన వ్యోమగాములే స్పేస్ వాక్ చేశారు. ఇప్పుడు ప్రైవేట్ మిషన్‌లో ఐజక్‌మన్, గిల్లిస్‌తో పాటు అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో పోటీట్, అన్నా మీనన్ ఉన్నారు.
Admin
Studio18 News