Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Balakrishna – Vijayawada Floods : హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తాము ప్రకటించిన విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసేందుకు వీరు విజయవాడకు వచ్చారు. ఇక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలను అందజేయనున్నారు. ఈ సందర్భంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. కనివిని ఎరుగని వర్ష ప్రభావంతో వచ్చిన వరదల కారణంగా చాలా ఊర్లు జలమయం అయ్యాయని అన్నారు. ప్రాంతాలు వేరైనప్పటికీ మనందరిదీ తెలుగు భాష. ఒక ప్రాంతానికి ఆపద వస్తే మరో ప్రాంతం నుంచి సాయం చేసే విధంగా ఒక కుటుంబంలాగా అంతా పనిచేశారన్నారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నా సరే రాష్ట్రం కోసం తమ వంతు సాయం చేశారని, సీఎం రిలీఫ్ ఫండ్‌కి చెక్కులు ఇవ్వడానికి విజయవాడ వచ్చినట్లు చెప్పుకొచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుందన్నారు. కొంతమంది పేర్లు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదని, ఈ వరదని ప్రభుత్వం సృష్టించింది అని కొందరు వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారన్నారు. వరద బాధితుల కోసం సాయం చేసిన వాళ్లందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. వరద బాధితులకు ఆదుకునేందుకు నందమూరి బాలకృష్ణ ఏపీకి రూ.50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. అదేవిధంగా యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ.15 లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు, విశ్వక్ సేన్ ఏపీకి రూ.5 లక్షలు, తెలంగాణకు రూ.5 లక్షలను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Admin
Studio18 News