Studio18 News - అంతర్జాతీయం / : Nuclear power plant on Moon: అదో ప్రతిష్టాత్మక మిషన్. రెండు మిత్రదేశాలు.. మరో రెండు ప్రత్యర్థి దేశాలు కలసి అడుగులు వేస్తున్నాయి. అమెరికాకు పోటీగా అంతరిక్షంపై పట్టుకోసం ఆ మూడు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చైనా, రష్యాతో పాటు భారత్ కూడా భాగస్వామ్యం అవుతోంది. చందమామ మీదకు మనిషి వెళ్లి కాలు మోపి మరీ తిరిగొచ్చాడు. ఇది అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే ఓ రికార్డ్. ఇదంతా చరిత్ర. కానీ.. భవిష్యత్‌లో ఏకంగా భూమిమీద నివసించినట్లు చంద్రుడిపై కూడా మనుషులు జీవిస్తారు. చంద్రుడి మీద ఏర్పడే మనుషుల కాలనీల కోసం ఏకంగా అణువిద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అందుకే జాబిలిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్! చంద్రుడిపై ఆవాసాల ఏర్పాటుకు ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ప్రణాళికలు రెడీ చేశాయి. అయితే జాబిల్లి మీద మానవ నివాసాలు ఏర్పడితే.. విద్యుత్ సరఫరా ఎలా అనేది కీలకంగా మారింది. కరెంట్ సప్లై ఉంటే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడుతాయన్న భావన ఉంది. అందుకే జాబిలి మీద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలని ఆలోచన పుట్టింది. ఇందుకోసం రష్యా, చైనా, అమెరికా కలసి నడుస్తున్నాయి. అయితే సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ సరఫరా కుదరదని.. అణువిద్యుత్తు ఒక్కటే పరిష్కారమని అంటున్నారు. అందుకే జాబిలిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను నిర్మించనుంది రష్యా. భారత్, చైనా భాగస్వాములుగా.. చంద్రుడిపై అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రష్యా చేపట్టిన మిషన్‌లో భారత్, చైనాలు భాగస్వాములు అవుతున్నాయి. జాబిలిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు కొద్ది నెలల కింద రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్‌కాస్మోస్ ప్రకటించింది. దీనికోసం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు కూడా తెలిపింది. తమ మిషన్‌లో అంతర్జాతీయ సమాజం భాగస్వామ్యం ఉంటుందని.. ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేయడానికి భారత్, చైనా ఆసక్తిగా ఉన్నాయని రష్యా తెలిపింది. 2040 నాటికి చంద్రునిపైకి మానవ సహిత యాత్రను చేపట్టి, స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న భారత్.. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అర మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి! రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్‌కాస్మోస్ చేపట్టబోయే ఈ మిషన్‌తో చంద్రుడిపై అర మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించనున్నారు. రష్యా, చైనా కలిసి పనిచేస్తున్న ప్లాంట్‌కు రియాక్టర్ శక్తిని అందిస్తుంది. చంద్రుడిపై స్థావరం కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నాలకు ఈ మిషన్ సహకరిస్తుందని భావిస్తున్నారు. రష్యా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అత్యంత క్లిష్టమైంది. అయితే అమెరికా, రష్యాతో తన దౌత్య సంబంధాలను భారత్ చాలా తెలివిగా వాడుకుంటుందని నిపుణులు అంటున్నారు. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో తాము సాధించిన అపార నైపుణ్యం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం ఉపయోగపడుతుందని రష్యా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. చంద్రుడిపై 2033-35 నాటికి అణువిద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడానికి చైనాతో కలిసి చాలా సీరియస్‌గా పనిచేస్తోంది. భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెళ్లు అందించలేవని, న్యూక్లియర్ పవర్‌తోనే సాధ్యమవుతుందని భావిస్తోంది.
Admin
Studio18 News